Sunday, March 27, 2022

యుద్ధం

 

నియంతల  నిరంకుశ నిర్ణయాల కిందపడి  నలుగుతున్న ప్రజలు !
పరిపాలకుల  అహాలకి  స్వాహా అవుతున్న పౌర సమాజాలు !!

శతాబ్దాల చరితను తుడిచి పారేస్తున్న సైనికుల పదఘట్టనలు !
నాగరికతను నిలువునా  కాల్చేస్తున్న అగ్నిశిఖలు !!

విరామమెరుగక పనిచేస్తున్న ఆయుధ కర్మాగారాలు !
క్షిపణుల తాకిడికి  ఛిద్రమవుతున్న క్షితిజ తలాలు !!


వెల్లువలా  దూసుకొస్తున్న తూటాల సమూహాలు !
గగన తలాన్ని నిర్దయగా చీలుస్తూ సాగుతున్న యుద్ధవిమానాలు !!

నిట్ట నిలువునా విరిగి పడుతున్న ఆకాశహర్మ్యాలు !
కారు మబ్బులా  కమ్ముకుంటున్న విషవాయువుల మేఘాలు !!

ఎడతెగకుండా తెగి పడుతున్న శరీరాలు !
మానప్రాణాలకు రక్షణ ఇవ్వలేని వ్యవస్థలు !!

తిరిగిరాని తండ్రుల కోసం పిల్లల ఆర్తనాదాలు !
మరలిరాని  భర్తల కోసం  భార్యల  నిరీక్షణలు !!

అసువులు బాసిన కొడుకుల కోసం తల్లి తండ్రుల ఎదురుచూపులు !
చావలేక బ్రతుకుతున్న క్షతగాత్రుల నిటూర్పులు !!

గర్భస్థ శిశువుల జననాన్ని కోరుకోని మాతృదేవతలు !
దహన  సంస్కారానికి కై  వేచి చూస్తున్నా నిర్జీవ దేహాలు !!

ఖరీదైన సూటు బూటు లో దాచి ఉంచిన ఆటవిక సంప్రదాయాలు ! 
మరణాలతో వ్యాపారాలు సాగిస్తున్న అగ్రరాజ్యాలు !!


ప్రాణాలను లెక్కించక సరిహద్దులు దాటుతున్న సామాన్యులు
రక్షణ లేని వినువీధిని విడిచి పోతున్న శాంతి కపోతాలు !!

మానవాళి యావత్తు సిగ్గుతో తలదించుకున్న క్షణాలు !
మానవుని మనుగడను  నిష్కర్షగా ప్రశ్నిస్తున్న ఈ యుద్ధాలు .....



10 comments:

  1. అక్షర సత్యం... మానవ సమాజ మనుగడకే సవాల్ విసురుతున్న ఈ యుద్ధం గురించి చక్కగా విశ్లేచించారు... 👏👏👏

    ReplyDelete
  2. యుద్ధం యెక్క పరిణామాల నన్నిటిని శృజించిన కవిత, చాలా బాగుంది

    ReplyDelete
  3. "ఖరీదైన సూటు బూటు లో దాచిన ఆటవిక సంప్రదాయాలు "....👌👌👌

    ReplyDelete
  4. "ఖరీదైన సూటు బూటు లో దాచిన ఆటవిక సంప్రదాయాలు"...👌👌👌

    ReplyDelete
  5. మురళి నీ కవిత చాలా బాగుంది. యిప్పుడు జరుగుతున్న
    రష్యా ఉక్రైన్ యుద్ధం వార్తలు రోజు చూస్తుంటే చాలా బాధ కలుగతోంది

    ReplyDelete
  6. True picture of war consequences..
    Touching...

    ReplyDelete
  7. "రాబందుల రెక్కల చప్పుడు పయోధర ప్రచండ ఘోషం ఝంఝావిల షడ్జధ్వానం"
    వినపడుతుంది
    మీ కవితల లో

    ReplyDelete