Sunday, March 27, 2022

యుద్ధం

 

నియంతల  నిరంకుశ నిర్ణయాల కిందపడి  నలుగుతున్న ప్రజలు !
పరిపాలకుల  అహాలకి  స్వాహా అవుతున్న పౌర సమాజాలు !!

శతాబ్దాల చరితను తుడిచి పారేస్తున్న సైనికుల పదఘట్టనలు !
నాగరికతను నిలువునా  కాల్చేస్తున్న అగ్నిశిఖలు !!

విరామమెరుగక పనిచేస్తున్న ఆయుధ కర్మాగారాలు !
క్షిపణుల తాకిడికి  ఛిద్రమవుతున్న క్షితిజ తలాలు !!


వెల్లువలా  దూసుకొస్తున్న తూటాల సమూహాలు !
గగన తలాన్ని నిర్దయగా చీలుస్తూ సాగుతున్న యుద్ధవిమానాలు !!

నిట్ట నిలువునా విరిగి పడుతున్న ఆకాశహర్మ్యాలు !
కారు మబ్బులా  కమ్ముకుంటున్న విషవాయువుల మేఘాలు !!

ఎడతెగకుండా తెగి పడుతున్న శరీరాలు !
మానప్రాణాలకు రక్షణ ఇవ్వలేని వ్యవస్థలు !!

తిరిగిరాని తండ్రుల కోసం పిల్లల ఆర్తనాదాలు !
మరలిరాని  భర్తల కోసం  భార్యల  నిరీక్షణలు !!

అసువులు బాసిన కొడుకుల కోసం తల్లి తండ్రుల ఎదురుచూపులు !
చావలేక బ్రతుకుతున్న క్షతగాత్రుల నిటూర్పులు !!

గర్భస్థ శిశువుల జననాన్ని కోరుకోని మాతృదేవతలు !
దహన  సంస్కారానికి కై  వేచి చూస్తున్నా నిర్జీవ దేహాలు !!

ఖరీదైన సూటు బూటు లో దాచి ఉంచిన ఆటవిక సంప్రదాయాలు ! 
మరణాలతో వ్యాపారాలు సాగిస్తున్న అగ్రరాజ్యాలు !!


ప్రాణాలను లెక్కించక సరిహద్దులు దాటుతున్న సామాన్యులు
రక్షణ లేని వినువీధిని విడిచి పోతున్న శాంతి కపోతాలు !!

మానవాళి యావత్తు సిగ్గుతో తలదించుకున్న క్షణాలు !
మానవుని మనుగడను  నిష్కర్షగా ప్రశ్నిస్తున్న ఈ యుద్ధాలు .....



Friday, March 25, 2022

పేపర్ రాకెట్స్ 

 




శాంత వెళ్లి నాలుగు యేళ్లు అయిపోయింది.  50 ఏళ్ళు కలిసి బ్రతికాం అనేకంటే , కలతలు లేకుండా ఒకరి కోసం ఒకరు అని బ్రతికాం.పిల్లల చదువులు వాళ్ల ఉద్యోగాలు ఎలా జరిగాయో అన్ని , ఒక కలలాగా జరిగిపోయాయి అనిపిస్తుంది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే...

నేను గనుక లేకపోతే మీరు అసలు ఎలా నెట్టుకు వస్తారో అన్న శాంత  మాటలు ఎప్పుడు గుర్తుకొచ్చినా నా మీద  నాకే ఆశ్చర్యం వేస్తుంది

శాంత   జ్ఞాపకాలతో నాలుగేళ్లు నెట్టుకు వచ్చేసాను. ఇంకా ఎన్ని నెట్టుకు రావాల్సి వస్తుందో అని ఆలోచిస్తూ ఉండగా ఒక్కసారిగా దగ్గుతూ ఈ ప్రపంచంలోకి వచ్చాను.

గత 15 రోజులుగా ఈ దగ్గు ఒకటే చంపేస్తోంది,  అమెరికాలో ఉన్న పెద్ద వాడు ఇంజనీరు, సంవత్సరానికి ఒకసారి చుట్టపుచూపుగా వచ్చి పోతాడు ,చిన్నవాడు ఇండియాలో ఉన్న సూర్యుడు తోనూ , చంద్రుడు తోనూ,  పోటీ పడే  బిజీ డాక్టర్ ఆయే ,నాకు దగ్గు మందు అయిపోయి ఒకరోజు అయ్యింది, వాడికి  చెప్పి రెండు రోజులు అయింది అని నాలో నేను అనుకుంటూ ఉండగా,  ఎగురుకుంటూ వచ్చి నా చేతికి తగిలింది రంగు రంగుల బెలూన్.


చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు గాలి బుడగల తో ఆడుకున్న రోజులు ఒక్కసారి గిర్రున తిరుగుతూ ఉంటే తన్మయ్  రయ్  మని వచ్చాడు, తన గాలి బుడగ కోసం ,  grandpa, give me  my balloon అని ....నవ్వుకుంటూ నీ గాలిబుడగ బలే బాగుంది అన్న .... వాడు నా తెలుగు సరిగ్గా అర్థం చేసుకో లేడని తెలిసి ..మాటల్లోనే నేను ఇచ్చిన   బెలూన్ ని తీసుకుని  థాంక్యూ అని చెప్పి ఆటలో పడిపోయాడు.

సాయంత్రం ఇంటి ముందు ఉన్న పార్కులో కూర్చొని ఉదయమే చదివిన పేపర్ ని తిరిగి మళ్ళీ చదవడం ఒక అలవాటుగా మారింది  ఒంటరితనాన్ని వదిలించుకునే పనిలో భాగంగా.ఎదురింటి అపార్ట్మెంట్ లో ఉన్న  అవినాష్ కొడుకు తన్మయ్ ,   ఐదేళ్ల పసివాడు చాలా చురుకైన వాడు, వాళ్ల అమ్మతో పాటు పార్క్ కి వస్తూ ఉంటాడు. 


పార్క్ లో ఉన్న మొక్కలకి నీళ్ళు  పొసే రంగయ్య ఒక యాభై సంవత్సరాలు ఉంటాయేమో అక్కడే అవుట్ హౌస్ లో  ఉంటాడు ,   చుట్టుపక్కల అపార్ట్మెంట్ లో ఉన్నవారికి సహాయం గా ఉంటాడు రంగయ్య కొడుకు మోహన్ మంచి టెన్నిస్ ప్లేయర్ అక్కడే పార్కులో పిల్లలకు ఫిజికల్ ఫిట్నెస్ , టెన్నిస్ నేర్పిస్తూ ఉంటాడు.


తన్మయ్ బెలూన్ గాలికి ఎగురుతూ మళ్ళీ నా దగ్గరకు వచ్చింది.కొంచెం సేపు వాడిని ఆట పట్టించి వాడికి ఇచ్చి , వాడి  థాంక్స్  తీసుకుని  , రంగయ్య   అవుట్ హౌస్  వైపు  చూసేసరికి ...మొక్కలకు నీళ్ళు పోసిన రంగయ్య ఇంటిలోకి వెళ్తున్నాడు

ఇంతలో ఢామ్మని ఒక పెద్ద శబ్దం ...ఇటు  చూసేసరికి  తన్మయ్  భయం తో   ఒక్క క్షణం ఆగి తన  బెలూన్   పోయిందని భాధ తో ఏడవడం మొదలెట్టాడు అవుట్ హౌస్ లో ఉన్న రంగయ్య కొడుకు మోహన్ ఏడుపు ఒక్కసారిగా వినపడింది  , నేను వెళ్లి చూసే సరికి రంగయ్య భార్య లక్ష్మి , కొడుకు మోహన్ రంగయ్య ని పట్టుకొని ఏడుస్తున్నారు.

రంగయ్య పలకకుండా అచేతనంగా ఉన్నాడు. రంగయ్య  ఇక లేడు అని బాధపడుతూ బయటకు వచ్చిన నాకు తన్మయ్  ఏకబిగిన ఏడవడం ,  వాళ్ళ  అమ్మ తో వాడు అన్న మాటలు ...  నా   బెలూన్ లో గాలి  పోయింది , బెలూన్ చిరిగి పోయింది  ఈ  బెలూన్  అంటే నాకు ఇష్టం  , దానికి మళ్లీ   air fill చెయ్ మమ్మీ అని ఒకటే ఏడుపు. 

బెలూన్ కోసం ఏడుస్తున్న  తన్మయ్  ,   ప్రాణం కోసం ఏడుస్తున్న రంగయ్య కొడుకు ఒకేసారి కనపడ్డారు.

అంతే కదా గాలి బుడగ లాంటి జీవితం అని ఒక్క క్షణం నిట్టుర్చా కళ్ళకింద  చెమ్మ ని తుడుచుకుంటూ  గొంతు తడారిపోతుంది అని తెచ్చుకున్న Milton వాటర్ బాటిల్ లో వాటర్ తాగుతున్న.

ఇంతలో  తన్మయ్ ఒక పేపర్ రాకెట్  తో  ఆడుకుంటూ  కనపడ్డాడు, వాడి లో  బెలూన్  పోయిన బాధ పోయింది ,  పేపర్ రాకెట్ తో ఆనందంగా ఆడుకుంటున్నాడు.

రంగయ్య కొడుకు మాత్రం రంగయ్య కోసం  ఏడుస్తూ నే ఉన్నాడు   చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ  చేరి  , తలా  కొంచెం సహాయం చేయడం ప్రారంభించారు. 

తన్మయ్  పేపర్ రాకెట్ ని చూసి తనకిష్టమైన బెలూన్ పగిలిపోగా ,  దానికోసం  ఏడిచి  మర్చిపోయినది  చూసి ఎందుకో  ఒకసారి నా జీవితంలో నాకే కరెంట్ షాక్ కొట్టినట్లయింది 

శాంత  వెళ్ళాక నేనెలా నాలుగు ఏళ్ళు  నెట్టుకొచ్చింది  తన్మయ్ ని  చూశాక అనిపించింది పగిలిన  గాలిబుడగ లోకి  గాలి ఎక్కించలేము  , పోయిన  శాంత ని గాని, రంగయ్యని గాని తేలేము , కానీ కాలం తో   పరిగెత్తడానికి కొన్ని పేపర్ రాకెట్స్ రూపంలో తయారు చేసుకుని ముందుకు వెళ్లిపోవాలని ....  అమెరికా లో ఉన్న మనవడిని  మనవరాలిని  తలచుకుంటుండగా...చేయి  పట్టుకొని తాతయ్య ....అని తట్టి  లేపుతున్నాడు ట్యూషన్  ముగించుకుని  వచ్చిన మనవడు విశ్వ..